Saturday, June 27, 2020

కర్మ సిద్ధాంతం

కర్మ సిద్ధాంతం

కర్మ సిద్ధాంతం అనే మాటను చాలాసార్లు వింటుంటాం.మనిషి ప్రస్తుతం అనుభవిస్తున్న సుఖాలుగాని, కష్టాలుగాని- తాను అంతకుముందు చేసిన పనుల తాలూకు ఫలితాలే అనేది ఆ సిద్ధాంతం ముఖ్యసూత్రం. అతడు మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు, చెడు పనులు చేస్తే చెడు ఫలితాలు లభిస్తాయని దాని తాత్పర్యం. ఇక్కడ కర్మ అనే పదాన్ని రెండింటికి అన్వయించడం కనిపిస్తుంది. మనిషి తాను చేస్తున్న పని, ఆ పని తాలూకు ఫలితం-రెండింటినీ కర్మ అనుకుంటున్నాడు. అది సరికాదు.ల్మనిషి తన భావాలు, మాటలు, చేతల వల్ల కర్మను పోగేసుకుంటాడు. అతడిని ఏ రకమైన ఆలోచనలు, అభిప్రాయాలు ఒక పనికి ప్రోత్సహిస్తున్నాయో- అదే ‘కర్మ’ అని మనం అర్థం చేసుకోవాలి.
వ్యక్తి మాటలు, పనులు ఎదుటివారికి సంతోషం కలిగిస్తే, అది సత్కర్మ అవుతుంది.
అతడి వల్ల ఎవరికి ఏ విధంగా దుఃఖం కలిగినా, అది దుష్కర్మ అనిపించుకుంటుంది. కర్మ అనేదాన్ని భగవంతుడు పనిగట్టుకుని సృష్టించలేదు. నిజానికి కర్మ అనేది ఒక విశ్వసూత్రం. దాన్ని ఎవరైనా తప్పనిసరిగా అనుభవించి తీరాలి.
మనిషి ఒక విత్తనం నాటితే, అది ఫలించడానికి ఒకోసారి నెలలు సరిపోతాయి...ఒకోసారి ఏళ్ల తరబడి సమయం పడుతుంది. అంటే, కర్మ విత్తనం లాంటిది. ఆ కర్మ ఫలితం ఒక్కోసారి వెంటనే కనిపించవచ్చు. లేదా కొన్ని ఏళ్ల తరవాత అనుభవానికి రావచ్చు. ఫలితం మాత్రం తప్పనిసరి!కర్మ ప్రభావం నుంచి మనిషి బయటపడటం ఏమంత తేలికైన విషయం కాదు కొన్ని కర్మల నుంచి అతడు బయటపడటానికి క్షమ,  ప్రేమ,  సేవ వంటి లక్షణాలు ఉపయోగపడతాయి.దానధర్మాలు, పరోపకారం, ప్రతి ఒక్కరినీ ఆదరించడం వంటి గుణాలు, జ్ఞానార్జనకు మనిషి చేసే కృషి అతణ్ని కొన్ని కర్మల నుంచి విముక్తుణ్ని చేస్తాయి.
‘మనం ఏం చేశామని భగవంతుడు మనకీ కష్టాలు కలిగించాడు’- అని చాలామంది ఎన్నో సందర్భాల్లో దేవుణ్ని కోప్పడుతుంటారు దానికి బదులుగా వారు, తాము పూర్వం చేసిన దుష్కర్మల పట్ల ప్రాయశ్చిత్తం చెంది, భగవంతుడి క్షమ కోసం ప్రయత్నిస్తే చాలామటుకు కర్మల నుంచి విమోచనం లభిస్తుంది. లోగడ చేసిన తప్పుల గురించి పశ్చాత్తాపపడిన మనిషి ఇకపై చెడు కర్మల జోలికి పోడు కనుక, దుష్కర్మ ఫలితం పెరగకుండా చూడటం సాధ్యపడుతుంది. మనిషి ఒక సాధనలా, తపస్సులా భగవంతుడి అనుగ్రహం కోసం ప్రయత్నించాలి. మనిషి తనంత తాను బయటపడలేని కర్మల నుంచీ అతణ్ని భగవంతుడు వెలుపలికి తీసుకొస్తాడు. కర్మ అనేది విశ్వసూత్రం కనుక, అది జగన్నాథుడు లేదా విశ్వేశ్వరుడి నియంత్రణలో ఉంటుంది. సర్వోన్నత న్యాయస్థానం విధించిన మరణశిక్షను ఆ దేశాధ్యక్షుడు యావజ్జీవ శిక్షగా మార్చగలిగినట్లు, భగవంతుడి దయే మనిషి కర్మ తాలూకు తీవ్రతను తగ్గిస్తుంది. ఒక కర్మ గురించే కాదు- ఇంకా ఎన్నో అభిప్రాయాలు, నమ్మకాలు మనిషి రక్తంలో జీర్ణించుకుపోయాయి. అతడు తరతరాలుగా కొన్ని పొరపాటు అభిప్రాయాలూ ఏర్పరచుకొని, వాటి నుంచి బయటపడలేకపోతున్నాడు.
·  సుఖం దుఃఖం,
·  స్వర్గం నరకం,
·  పాపం పుణ్యం,
·  మంచి చెడు...
ఇలా ఎన్నింటి గురించో మనిషిలో కొన్ని అభిప్రాయాలు పేరుకుపోయి ఉన్నాయి.
కొన్ని అపోహలూ స్థిరపడ్డాయి వాస్తవానికి, కర్మ అనేది మహాప్రవాహం లాంటిది. దాని ఒడ్డున నిలిచి ‘ఇది మంచి, ఇది చెడు; ఇది పాపం, ఇది పుణ్యం’ అని నిర్ణయించడం చాలా కష్టసాధ్యమైన పని.అందువల్ల నిర్ణయాన్ని భగవంతుడికే వదిలేసి, నిశ్చింతగా భగవత్ మార్గంలో జీవించడం- మనిషికి తేలికైన పని. తెలివైన పని!

No comments:

Post a Comment

దేశీ వరి రకాలు

దేశీ వరి రకాలు 1) రక్తశాలి  >ఎరుపు> సన్నరకం> పంటకాలం>110 నుంచి 115 రోజులు. 2) కుల్లాఖర్ > ఎరుపు> లావురకము> పంటకాలం>1...