* బోరంపల్లిలో పది ఎకరాల్లో సాగు
* ఎకరాకు 15 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం
* రెండు రోజుల్లో కోత..
ఎకరాకు రూ. 1.20 లక్షల వరకు ఆదాయం
మంచిర్యాల : బూడిద గుమ్మడి.. దీనిని శుభకార్యాలు, పూజలు, వంటలు, మిఠాయిల్లో వాడడమేగాక ఆయుర్వేద మందుల తయారీలోనూ వినియోగిస్తుంటారు. మార్కెట్‌లో అంతటి డిమాండ్ ఉన్న పంటను ఎంచుకొని సాగు చేస్తున్నాడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌రావు. మరో రెండు రోజుల్లో పంట చేతికందే అవకాశముండగా, ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తుందన్న ధీమాతో ఉన్నాడు. భీమారం జడ్పీ ఉన్నత పాఠశాలలో సామాన్య శాస్త్రం ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ఎస్ శ్రీనివాస్‌రావుకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే మక్కువ. ఓ వైపు విద్యాబోధన చేస్తూనే సమయం దొరికినప్పుడల్లా వ్యవసాయ పనులు చేస్తున్నాడు. కోటపల్లి మండలం బోరంపల్లి సమీపంలో తనకున్న పది ఎకరాల్లో విభిన్న పంటలు వేయాలని భావించాడు. గతేడాది పత్తి వేసిన శ్రీనివాస్, ఈ ఏడాది ఫిబ్రవరిలో బూడిద గుమ్మడి పంట వేశాడు.
• ఖర్చు తక్కువ... ఆదాయం ఎక్కువ..!
గుమ్మడి సాగులో పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువగా ఉంటుందని శ్రీనివాస్‌రావు చెబుతున్నాడు. నేలను దున్నడం, చదును చేయడం, విత్తనాలు విత్తడం, కలుపు తీయడం తదితర ఖర్చులన్నీ కలిపితే ఎకరానికి రూ. 20 నుంచి రూ. 30 వేల వరకు పెట్టుబడి అయ్యిందని తెలిపాడు. పంట ఆశాజనకంగా ఉందని, ఎకరానికి 15 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాడు. ప్రస్తుతం మార్కెట్‌లో టన్ను గుమ్మడికాయలకు ధర రూ. 8 వేల వరకు పలుకుతుంది. ఎకరానికి రైతులకు రూ. లక్షా 20 వేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మార్కెట్‌లో ధర లేకున్నా పెద్దగా బెంగపడాల్సిన అవసరం లేదని, గుమ్మడి కాయలను 6 నుంచి 9 నెలల వరకు నిల్వ చేసుకోవచ్చని, మార్కెట్‌లో ధర ఉన్నప్పుడు పంటను అమ్ముకోవచ్చని అతను తెలిపాడు.
• సాగు విధానం..
గుమ్మడి పంట సాగు పెద్ద శ్రమతో కూడుకున్నది కాకపోయినా నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి. విత్తనం నాటినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ పంటకు తేలికపాటి బంక మన్ను నేలలు అనుకూలం. రెండో పంటగా దీనిని సాగు చేయాలనుకుంటే జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే విత్తుకోవాల్సి ఉంటుంది. 3 నుంచి 4 నెలల మధ్య పంట చేతికి వస్తుంది. నీటి సౌకర్యం తక్కువ ఉన్న రైతులు డ్రిప్ పద్ధతి ద్వారా నీటిని అందించాలి. సేంద్రియ ఎరువులను వినియోగించడం ద్వారా పంట సమర్థవంతంగా వస్తుంది. పంటల్లో మార్పులను గమనిస్తూ రసాయన ఎరువులను వినియోగించాలి.
€ గుమ్మడితో ఉపయోగాలు..
గుమ్మడి కాయ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఒక్కో కాయ కిలో మొదలుకొని.. ఐదు కిలోల వరకు బరువు తూగే అవకాశం ఉంది. గుమ్మడికాయలను ఆయుర్వేద మందుల తయారీతో పాటు వడియాలు, ఉబ్బసం, ఉదరకోశ వ్యాధుల నివారణ కోసం వాడుతారు. గృహ ప్రవేశాల సమయంలో ఇండ్ల ముందు కట్టడంతో పాటు, దిష్టి తగులకుండా వీటిని ఉపయోగిస్తారు. పెద్ద హోటళ్లలో గుమ్మడి కాయను పచ్చడిగా ఉపయోగించడంతో పాటు స్వీట్‌గా ఉపయోగిస్తుంటారు. బూడిద గుమ్మడిలో అనేక జౌషధ గుణాలు ఉండడం వల్ల దానిని తింటే అనేక అనారోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
* తక్కవ పెట్టుబడి.. ఎక్కువ ఆదాయం
మన ప్రాంతానికి కొత్త పంటను పరిచయం చేయాలని గుంటూరులో ఉన్న రైతులను సంప్రదించాను. గుమ్మడి విత్తనాలను తీసుకొచ్చి నాటాను. ప్రస్తుతం పంట చేతికొచ్చింది. గుమ్మడి సాగుకు తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడి ఉంటుంది. లాక్ డౌన్ ఉందని పంట కోయలేదు. గుమ్మడి కాయలు తెంపినా 9 నెలల దాకా నిల్వ చేసుకోవచ్చు. రెండు మూడు రోజుల్లో పంట కోస్తా. మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న పంట ఇది. మన దగ్గర మార్కె టింగ్ సౌకర్యం లేకపోగా ముందుగా హైదరాబాద్, కరీంనగర్‌లకు చెందిన వ్యాపారులతో ముందస్తు సంప్రదింపులు జరిపి మార్కెటింగ్ చేసుకోవాలి.
- శ్రీనివాస్‌రావు, రైతు, ఉపాధ్యాయుడు
No comments:
Post a Comment