కృతజ్ఞత
“కృతజ్ఞత ”అంటే ఒకరు మనకు చేసిన మేలును మరచిపోకుండా ఉండటం.
మనం ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడో, ఏదో ఒక సహాయం మనకు అవసరమైనపుడో, మనం అడిగితే సహాయపడేవారు కొందరుంటారు.
మనం అడగకపోయినా మనకు అవసరమైన ఉపకారం చేసే ఉదారులు కొందరుంటారు. వీరికెప్పుడూ మనం కృతజ్ఞులమై ఉండాలి. కృజ్ఞత అనేది నాగరిక సంస్కారం...
వాల్మీకి రాముణ్ణి వర్ణిస్తూ “ధర్మజ్ఞశ్చ , కృతజ్ఞశ్చ” అన్నాడు. సీతమ్మను అపహరించుకొనిపోతున్న రావణునితో పోరాడి ఆ సమాచారాన్ని రామునికి చెప్పి ప్రాణాలు కోల్పోయిన జటాయువుకు రాముడు కృతజ్ఞతతో అంతిమ సంస్కారం చేశాడు.
రావణసంహారంలో తనకు తోడ్పడిన వానరులకోసం.. ఈ వానరులు ఎక్కడ ఉంటే అక్కడ త్రికాలాలలోనూ మధురఫలాలను ఇచ్చే వృక్షాలు ఉండేటట్లు, అక్కడి నదులలో నిరంతరం స్వాదు జలం ప్రవహిస్తూ ఉండేటట్లు వరం ఇవ్వ వలసిందిగా రాముడు ఇంద్రుణ్ణి కోరాడు.ఇదీ ఆయన కృతజ్ఞతా లక్షణం.
మహా భారతంలో.. దగ్ధమైన లాక్షాగృహంలోంచి ప్రాణాలతో బయటపడి, ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణుని ఇంట్లో, తన కుమారులతో తలదాచుకుంటున్నకుంతి , తమకు ఆశ్రయం ఇచ్చిన ఆ బ్రాహ్మణునకు ఒక కష్టదశ సంభవించగా, అతనికి ప్రత్యుపకారం చేయటం తన ధర్మమని భావించిన సందర్భంలో ..
“ఒకరు తమకు చేసిన ఉపకారాన్ని గ్రహించటం పుణ్యం, దానికి సమమైన ప్రత్యుపకారాన్ని చేయటం మధ్యమం, వారు చేసిన ఉపకారానికి మించిన ప్రత్యుపకారం చేయటం ఉత్తమం” అంటుంది.
“ఏరు దాటాక తెప్ప తగలెయ్యటం”.. అనే చందంగా కాకుండా, మన ఉనికికి , ఉన్నతికి కారకులైనవారి పట్ల మనం కృతజ్ఞులమై ఉండాలి.
ఒకనాడు మనకు మేలుచేసిన మనిషి , విధివశాత్తూ ఒక కష్టంలో పడినట్టు మనకు తెలిస్తే అతనియందు సకాలంలో, అవసరానికి తగినట్టుగా స్పందించకపోతే అది కృతఘ్నత ఔతుంది.
ఉత్తములైన ఆశ్రితులు, ఆశ్రయ దాత క్షేమాన్ని కోరుకోవాలనీ , కృతజ్ఞత ఉత్తమ లక్షణమనీ తెలుస్తోంది. సజ్జనులు ఇతరులు తమకు చేసిన ఉపకారాన్ని మరచిపోరు.
No comments:
Post a Comment