Friday, June 26, 2020

ఆ రెండుకోట్ల ఆదాయం కేవలం పచ్చళ్లతోనే సాధ్యమయింది..

ఆ రెండుకోట్ల ఆదాయం కేవలం పచ్చళ్లతోనే సాధ్యమయింది..

ఆమె తయారు చేసేది పచ్చళ్లూ, రకరకాల కారం పొడులు. వాటితోనే ఏడాదికి రెండు కోట్ల రూపాయల టర్నోవరు సాధించింది. అంతేనా... ఆమె విజయాన్ని డీఆర్‌డీఏ ఏకంగా ఓ లఘుచిత్రంగా రూపొందించింది. కర్నూలు జిల్లా నంద్యాల పరిధిలోని పాండురంగాపురానికి చెందిన ఆరిమండ పద్మావతి విజయ గాథ ఇది, తన మాటాల్లోనే..

ఆరోజు నాకు ఇప్పటికీ గుర్తే. కొందరం మహిళలం కలిసి రూ.10 వేల అప్పుతో పచ్చళ్ల తయారీ ప్రారంభించాలనుకున్నాం. వాళ్లేమో చివరి నిమిషంలో ‘భాగస్వామ్యం వద్దు కూలీ ఇస్తే చాలు’ అనేశారు. ఒక్కక్షణం భయం వేసినా... ధైర్యంగానే ఒక్కదాన్నే పచ్చళ్ల తయారీ మొదలుపెట్టా. ప్రస్తుతం ఏడాదికి రెండుకోట్ల రూపాయల టర్నోవరు సాధిస్తున్నా. విదేశాలకూ పంపిస్తున్నాం. 

వాస్తవానికి మేం తొలిసారి 1997లో బ్యాంకు నుంచి ‘కల్కి భగవాన్‌ పొదుపు లక్ష్మి గ్రూప్‌’ పేరిట రూ.10 వేలు రుణం తీసుకున్నప్పుడు.. అప్పటి కలెక్టర్‌ అజయ్‌జైన్‌, డీఆర్‌డీఏ పీడీ శంకర్‌నాయక్‌ ‘మీ గ్రామంలో మిరప ఎక్కువగా పండిస్తారు కదా! పచ్చళ్ల యూనిట్‌ పెట్టకూడదూ’ అంటూ సలహా ఇచ్చారు. ఆ సలహా, మా శ్రమా రెండు కలిసొచ్చాయి. అప్పుడు అవసరాన్ని బట్టి కాస్త బంగారాన్ని కూడా తాకట్టుపెట్టి ఈ వ్యాపారం మొదలుపెట్టా.

అదే సమస్య అయ్యింది.

మా వారు సాంబిరెడ్డి మొదటి నుంచి సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేసేవారు. తన సహకారంతో ఉన్న పది ఎకరాల్లో మిర్చి పండించి ఆ పంటతో కారం, పచ్చళ్లు పెట్టడం మొదలుపెట్టా. అప్పట్లో నాలుగు రకాల పచ్చళ్లు పెట్టాం. కానీ అవి ఎక్కడ అమ్మాలో తెలియలేదు. నేరుగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికే తీసుకెళ్లాం. డీఆర్‌డీఏ ద్వారా అమ్మించారు. మంచి పేరొచ్చింది. మళ్లీ డీఆర్‌డీఏ, కలెక్టరేట్‌ నుంచి లక్ష రూపాయల రుణం తీసుకున్నాం. దీనికి తోడు డ్వాక్రా ప్రదర్శనలు ఎక్కడ జరిగినా మా పచ్చళ్లను ఉంచేవాళ్లం. ఇలా ప్రభుత్వం సూచించిన ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రం చివరకు ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో సైతం స్టాల్‌ పెట్టేవాళ్లం. పోలీస్‌ బెటాలియన్‌ సూపర్‌మార్కెట్‌లో ఏటా రూ. మూడు లక్షల వ్యాపారం పచ్చళ్ల ద్వారా చేస్తుంటాం.

విదేశాలకు సైతం.

ప్రస్తుతం 12 రకాల పచ్చళ్లూ, 10 రకాల కారంపొడులు తయారు చేస్తున్నా. మా పొలంలో పండే మిర్చిపంటతోపాటు ఇతర రైతుల నుంచీ అదనంగా మిర్చి కొంటున్నాం. అన్ని కారంపొడుల్లో కరివేపాకు వాడతాం. వడియాలూ, లడ్డూలూ, అరిసెలూ... ఇలా ఇరవై రకాల చిరుతిళ్లు కూడా తయారు చేసి అమ్ముతున్నాం. ప్రతిఏటా విదేశాలకు సైతం పచ్చళ్లు ఎగుమతి చేస్తాం.

కుటుంబ సభ్యులు చేదోడుగా

వ్యాపారం బాగా ఊపందుకుని ఏ ఇబ్బందీ లేదనుకుంటోన్న సమయంలో మా వారు క్యాన్సర్‌ బారిన పడ్డారు. నన్ను ఆ స్థితిలో చూసిన మా అబ్బాయీ, కోడలు వాళ్ల ఉద్యోగాలు మానేసి నాకు తోడుగా వచ్చేశారు. ప్రభుత్వ సహకారంతో ఆన్‌లైన్‌ బిజినెస్‌ చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే ‘స్టార్టప్‌ ఇండియా - మేకిన్‌ ఇండియా’లో భాగంగా మా నందిని స్వగృహా ఫుడ్స్‌ ఎంపికైంది. ఇరవై ఏళ్లుగా ఏటా గ్రామంలోని 30 మంది మహిళలకు ఉపాధి అందిస్తున్నాం. అలాగే అవకాశం వచ్చినప్పుడల్లా ఆశ్రమాలూ, ఆసుపత్రులూ, దేవస్థానాలూ, అన్నదానాలకు ఉచితంగా పచ్చళ్లు అందిస్తుంటా. నా శ్రమను గుర్తించిన డీఆర్‌డీఏ నా వంటల విశేషాలను షార్ట్‌ఫిలిం తీశారు. రుణమిచ్చిన బ్యాంకు ప్రతినిధులు కూడా ఓ డాక్యుమెంటరీని తీశారు. వ్యవసాయ శాఖ, డ్వాక్రా, మహిళా దినోత్సవాల సమయంలో అవార్డులతో సత్కరించారు.

No comments:

Post a Comment

దేశీ వరి రకాలు

దేశీ వరి రకాలు 1) రక్తశాలి  >ఎరుపు> సన్నరకం> పంటకాలం>110 నుంచి 115 రోజులు. 2) కుల్లాఖర్ > ఎరుపు> లావురకము> పంటకాలం>1...