🤔🤔రోటిపచ్చళ్ళ ఉద్యమం(2016)🤔🤔
రోటి పచ్చడి.. పెళ్ళిలో ఎన్ని వందల రకాల వంటలు వడ్డించినా రోటిపచ్చడి లేకపోతే అది విందే కాదు. గోంగూర, దోసకాయ, దొండకాయ ఇలా ఏదో ఒక రోటి పచ్చడి ఉండాల్సిందే. రోటి పచ్చడి అంటే అంత ఇష్టం ఉన్నా, ఇప్పుడు మనం తింటున్నది మిక్సీలో వేసిన రోటి పచ్చడి మాత్రమె. అంటే మైసూరు పాక్ లో మైసూర్ ఎలా ఉండదో, రోటి పచ్చళ్లలో రోలు కూడా లేకుండా పోయింది.
జనం అంతా మిక్సీ పచ్చళ్లనే రోటి పచ్చళ్ళు గా భావించి, తృప్తి పడుతున్న వేళ, ఒక వ్యక్తి విప్లవశంఖం పూరించాడు. “మిక్సీ పచ్చళ్ళ ఆధిపత్యం నశించాలి, రోళ్ళు, పచ్చడిబండలతో ప్రతి ఇల్లు కళకళ లాడాలి” అంటూ నినదించాడు. రోలు, పచ్చడిబండ(పచ్చడి నూరుకునే కర్ర) చేతబట్టి ఫేస్ బుక్ లో చెలరేగిపోయారు. మిక్సీలో వేసే పచ్చడీ ఒక పచ్చడేనా, చక్కగా ఒక రోలు కొనుక్కుని మన పచ్చడి మనం నూరుకోలేమా, మన చేతల్లో సత్తువలేదా, మన ఇళ్ళలో రోళ్ళు లేవా అని ప్రశ్నించిన ఆ విప్లవకారుడి పేరు వాసిరెడ్డి వేణుగోపాల్. రచయిత, జర్నలిస్ట్ కం పబ్లిషర్ అయిన వేణుగోపాల్ పెన్ను పక్కనబెట్టి రోకలి చేతబట్టి, రోజుకో పచ్చడి నూరుతూ, ఆ ఫోటోలు ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తూ , చదివేవాళ్ళ నోళ్ళలో నీళ్ళూరేలా వర్ణిస్తూ, ఒక అలజడి సృష్టించారు. దీనితో రోటిపచ్చళ్ళ గతవైభవాన్ని తలచుకుంటూ, మిక్సీల డామినేషన్ ని తిట్టుకుంటున్న భోజనప్రియులకి ఆకలి రెట్టింపు అయ్యింది. కిచెన్ లో మూలకి వెళ్ళిపోయిన రోళ్ళు , మళ్ళీ దర్జాగా బయటకి వచ్చాయి. రోజుకో పచ్చడిని రుచిచూస్తూ, చూపిస్తూ రోళ్ళు మళ్ళీ వంటింటి మహారాణులు అయ్యాయి. చరిత్రకారులు రోటిపచ్చళ్ళ చరిత్ర ని పరిశోధించడం మొదలు పెట్టారు. ఆరోగ్య నిపుణులు, రోటి పచ్చళ్ళు కమ్మగా ఉండడమే కాదు, ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయో వివరించడం మొదలు పెట్టారు. సోషల్ మీడియా లో మొదలైన రోటిపచ్చళ్ళ ఉద్యమాన్నిసామాన్య ప్రజలోకి తీసుకెళ్లేందుకు ఇప్పుడు ఒక పుస్తకం మార్కెట్లోకి రాబోతోంది.
పచ్చళ్లలో రోటి పచ్చళ్ళు వేరు అని మాత్రమే అని తెలిసిన మనకు ఆ రోటి పచ్చళ్లలో 14 రకాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. త్వరలో రాబోతున్న ‘రోటి పచ్చళ్ళు’ పుస్తకం కోసం ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా. పూర్ణచంద్ గారు రాసిన ముందుమాటలో ఈ 14 రకాల పచ్చళ్ళను వివరించారు. అవేమిటంటే..
*పచ్చళ్లు.. పధ్నాలుగు రకాలు..
….
1. తొక్కు: గోంగూర తొక్కు, చింతకాయ తొక్కు, ఉసిరికాయ తొక్కు, ఇవన్నీ నిలవ ఉండేలా తయారు చేసిన పచ్చళ్ళు. ఉప్పు కలిపి ఊరబెడతారు.
2. తురుము పచ్చడి: మామిడి, కేరెట్, బీట్రూట్, క్యాబేజీ వీటిని తురిమి తాలింపు పెట్టింది తురుము పచ్చడి. తురుముగా కనిపించటం కోసం దీన్ని రోట్లో నూరకుండానే పచ్చడి చేస్తారు.
3. ముక్కలపచ్చడి: తాలింపుగింజలు, ఉప్పు, కొత్తిమీర వీటిని రోట్లో మెత్తగా నూరి, దోసకాయ, మామిడి, దొండ ఇలాంటి కాయల్ని చిన్నముక్కలుగా తరిగి కలిపి తాలింపు పెడతారు.
4. పప్పుల పచ్చడి: కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, ఉలవలు ఇలాంటి పప్పుల్ని దోరగా వేయించి రోట్లో నూరి (లేదా రుబ్బి) చేసిన పచ్చడి. కందిపచ్చడిని పచ్చిపులుసుతోనూ, ఉలవపచ్చడిని మీగడతోనూ, తినాలని ఆయుర్వేద శాస్త్రం చెప్పింది. పెసరపచ్చడిని పెనం మీద చేత్తో వత్తి అట్టులా కాల్చి అన్నంలో ఆమ్లేట్‘ లాగా తింటారు.
5. ఆవపచ్చడి: రోట్లో నూరిన ఆవపిండిని పెరుగులో కలిపి తాలింపు పెట్టేది ఆవపచ్చడి.
6. పెరుగుపచ్చడి: కూరగాయల్ని నిప్పులమీద కాల్చిన బజ్జీపచ్చడిలో పెరుగు కలిపితే అది పెరుగుపచ్చడి. అరటి ఊచ(దూట)ను ఉడికించి రోట్లో నూరి చేసిన పెరుగుపచ్చడి చాలా రుచిగా ఉంటుంది.
7. ఊర్బిండి: రుబ్బిన పదార్ధాన్ని ఊరుపిండి అంటారు. ముక్కలకు ఉప్పు రాసి, కొంతసేపు ఊరిన తరువాత రోట్లో వేసి నూరి తయారు చేసే పచ్చడిని ఊరుపిండి లేదా ఊర్బిండి అంటారు.
8. ఊరు పచ్చడి: దీన్ని రోటి పచ్చడి అంటున్నాం. పప్పుదినుసులు, కూరగాయ ముక్కలు వేయించి, మిరపకాయలు కలిపి రుబ్బిన పచ్చడి ఊరుపచ్చడి.
9. బజ్జీ పచ్చడి: శ్రీనాథుడు బజ్జులు అనే వంటకం గురించి ప్రస్తావించాడు. ఏదైనా కూరగాయని నిప్పులమీద కాల్చి, రోట్లో వేసి మూరి, పప్పుదినుసులతో తాలింపు పెట్టిన పచ్చడినే ఆయన ‘బజ్జు’ అన్నాడు. అంటే,బజ్జీ పచ్చడి!
10. ఊరగాయ పచ్చడి: కూరగాయని ముక్కలుగా తరిగి, ఉప్పు కలిపి ఉంచడాన్ని ఊరబెట్టడం అంటారు. నిమ్మ, టొమోటో మామిడి, చింతకాయ, కంద, పెండలం, గోంగూర వీటితో ఎక్కువగా ఊరగాయ పచ్చళ్ళు పెడుతున్నాం.
11. ఊరుపిండి పచ్చడి: నువ్వులు, వేరుశెనగ గింజలు, ఆవాలు, కొబ్బరి ఇలాంటి వాటిలోని నూనెని తీసేసిన తర్వాత మిగిలే పిండిని తెలికిపిండి అంటారు. దాన్ని నీళ్ళలో గాని, మజ్జిగలో గాని నాలుగైదు రోజులు నానబెడితే పులుస్తుంది. దానికి అల్లం, పచ్చిమిర్చి వగైరా చేర్చి రుబ్బి, తాలింపు పెట్టిన పచ్చడిని “ఊరుపిండి పచ్చడి” అంటారు.
12. కూరపచ్చడి: కూరగాయని మగ్గబట్టిన తరువాత కూరగానూ చేసుకోవచ్చు. పచ్చడిగానూ చేసుకోవచ్చు. కూరవండాక కూడా దాన్ని రోట్లో వేసి నూరితే కూరపచ్చడి అవుతుంది.
13. ఆక్కూర పచ్చడి: గోంగూరతో మాత్రమే కాదు, తోటకూర, పాలకూర, మెంతికూర, చుక్కకూర, గుంటగలగరాకు, లేత పారిజాతం ఆకులు, లేత సొర ఆకులు, లేత తమలపాకులు, కరివేపాకు, కొత్తిమీర, పొదీనా…ఇలా ఆక్కూరలన్నింటి తోనూ రోటి పచ్చళ్ళు చేసుకోవచ్చు.
14. పూలపచ్చడి: మునగపూలు, అవిశపూలు, వేపపూలు మామిడి పూలు, క్యాలీఫ్లవర్ పూలు, గోంగూర పూలు ఇవి.
సో, అది ఫ్రెండ్స్, ఇన్ని రకాల రోటిపచ్చళ్ళు ఉన్నాయన్న మాట. వాసిరెడ్డి వారి కృషితో, తెలుగు వాకిళ్ళలో మళ్ళీ రోళ్ళ చప్పుడు మొదలవబోతోంది. శభాష్ ‘రోలురత్న’ వాసిరెడ్డి వేణుగోపాల్ గారు.
–నరేష్ శిరమని
సోషల్ మీడియా ద్వారా
No comments:
Post a Comment