Tuesday, August 4, 2020

నువ్వులు - ఖర్జూరలతో కమ్మని లడ్డు

నువ్వులు - ఖర్జూరలతో కమ్మని లడ్డు

కిలో ఖర్జూరపండ్లను గింజతీసి పెట్టుకోవాలి!
కిలో నువ్వులను దోరగా వేయించి పెట్టుకోవాలి!
ముందుగా ఖర్జూరపండ్లను ,గుప్పెడు గుప్పెడు  రోట్లో వేసి మెత్తగా దంచుకోవాలి.గుజ్జును విడిగా పెట్టుకోవాలి. తరువాత నువ్వులను కూడా మెత్తగా రోకలితో దంచుకోవాలి.తరువాత రెండింటినీ కలిపి బాగా కలిసేలా దంచుకోవాలి. తరువాత ముద్దలు కట్టుకోవాలి! రెండు కిలోల ప్రమాణానికి, ముప్పయి ముద్దలు అవుతాయి! అంతా కలిపి గంట పని!
కిలో ఖర్జూర, వంద రూపాయలు.
కిలో నువ్వులు, వంద రూపాయలు!
(మొన్న మార్కెట్ ధరలు)

ముప్పయి లడ్డూలంటే,ఒకరికి రోజుకు ఒకటి చొప్పున నెల రోజులకు సరిపోతాయి!
నెలకు రెండు వందల రూపాయల ఖర్చు!

***
నువ్వుల్లో ఏముంటాయే చూద్దాం!

నువ్వులు, జీర్ణశక్తిని పెంచుతాయి.
రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
కేన్సర్ నిరోధకంగా పని చేసే ఫైటిక్ యాసిడ్ - మెగ్నీషియం ఫైటో స్టెరాల్స్ కూడా నువ్వుల్లో ఎక్కువ ఉంటాయి. శరీరవ్యవస్ధను నిదానింపచేసే ధయామిన్ -ట్రిప్టోఫాన్ విటమిన్లు ఉంటాయి.
ఒంటినోప్పుల్ని తగ్గించి, మనసును ఉత్తేజితం చేసి గాఢ నిద్రకు దోహదం చేసే సెరొటోనిన్ కూడా నువ్వుల్లో ఎక్కువే ఉంటుంది.
నువ్వులు ఎముకలను పటిష్ఠపరుస్తాయి.తద్వారా ఎముకలను గుళ్లబార్చే ఆస్టియోఫోరోసిస్ వ్యాధి రాకుండా కాపాడతాయి.
***

ఖర్జూరాల వల్ల ఉపయోగాలు!

ఖర్జూరాలను ప్రొటీన్ పవర్ హౌజులు అంటారు!
ఖర్జూరాలలో అధికమోతాదులలో కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి.
ఖర్జూరాలను తినడం వల్ల, కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బులు దూరం అవుతాయి!
ఖర్జూరాలు రక్తపోటును నియంత్రిస్తాయి!ఎముకల పటిష్ఠతకు ఉపయోగ పడతాయి!
ఉదర సంబంధ వ్యాధులకు ఈ పండ్లు ఉపయోగ పడతాయి!
అన్ని రకాల పండ్లలో కంటే,ఖర్జూరాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది.కనుక మలబద్ధకానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది!
***

వృద్ధులకు పిల్లలకు అమృతాహారం, నువ్వులు-ఖర్జూరలడ్డు! వారికి ప్రతిరోజు ఒక లడ్డు ఇవ్వాలి. స్కూలు ఫంక్షన్లలో పిల్లలకు ఆయిల్ స్వీట్స్ కంటే, నువ్వులు-ఖర్జూరలడ్డును చేయించి ఇవ్వచ్చు!
ఇందులో ఎండుకొబ్బెరి జీడిపప్పు వేరుశెనగ , వేయించి పొడికొట్టిన తృణధాన్యాలు (రాగులు సజ్జలు రొన్నలు గోధుమలు)వేయించి పొడుకొట్టిన పప్పుధాన్యాలు(మినుములు పెసలు శెనగలు కందులు) వంటివి కూడా చేర్చుకుని మరింత బలవర్ధక లడ్డును, సంపూర్ణ ఆరోగ్యకర లడ్డును చేసుకోవచ్చు. సువాసన కోసం, యాలకుల పొడిని కలపొచ్చు. ముద్ద కట్టేపుడు సరిగా ముద్దకు రాకపోతే తగినంత తేనె కలిపి ముద్దలు చేసుకోవచ్చు.
అన్ని రకాల ఎండు పండ్లను కూడా ఇందులో చేర్చుకోవచ్చు! మిగతా పదార్దాలకు సమానంగా, అన్నిరకాల ఎండుపండ్లను ఉండేట్టు చూసుకోవాలి.

***
నువ్వులు-ఖర్జూరలడ్డులో నూనె చక్కెర కలపనక్కరలేదు!
నీరు కలపాల్సిన అవసరం లేదు!
పదార్ధాలను ఉడికించాల్సిన అవసరం లేదు.
పదార్ధాల్లోని జీవపదార్ధం,సజీవంగా మన శరీరానికి అందుతుంది.
ఎక్కువ కాలం నిలవ ఉంటాయి.
***

నువ్వులు - ఖర్జూరలడ్డు  నిజమైన అమృతాహారం!

No comments:

Post a Comment

దేశీ వరి రకాలు

దేశీ వరి రకాలు 1) రక్తశాలి  >ఎరుపు> సన్నరకం> పంటకాలం>110 నుంచి 115 రోజులు. 2) కుల్లాఖర్ > ఎరుపు> లావురకము> పంటకాలం>1...