టీవీలో వచ్చే వివిధ ఛానెల్స్ అన్నీ ఒకే ఒక కేబుల్ తీగ ద్వారా ఎలా ప్రసారం అవుతాయి
మీ టీవీ వెనుక తగిలించే కేబుల్ తీగను మీ ప్రాంతంలో ఉండే కేబుల్ ఆపరేటర్ ఏర్పాటు చేస్తాడు. మీ టీవీలో ప్రసారమయ్యే రకరకాల ఛానెల్స్ నిర్వాహకులకు అతడు కొంత సొమ్ము చెల్లించి వాటిని ప్రసారం చేసే హక్కుల్ని పొందుతాడు. ఆయా ఛానెల్స్ వాళ్లు తమ కార్యక్రమాల సంకేతాలను ఉపగ్రహాలకు ప్రసారం చేస్తే వాటిని ప్రత్యేక ఏంటెన్నాల ద్వారా కేబుల్ ఆపరేటర్లు సేకరిస్తారు. అలా సేకరించే ఛానెల్స్ సంకేతాలన్నీ వేర్వేరు ఫ్రీక్వెన్సీలలో ఉంటాయి. వాటిని ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ పరికరం గ్రహించి కేబుల్ తీగ ద్వారా ప్రసారం చేయగలిగే ఫ్రీక్వెన్సీలోకి మారుస్తుంది. ఇవన్నీ కలగలిసి కేబుల్ ద్వారా ఇంటికి చేరుకుంటాయి. టీవీ వెనుక ఉండే రేడియో ఫ్రీక్వెన్సీ (RF) సాకెట్‌కు తగిలించినప్పుడు ఆ సంకేతాలన్నీ వేర్వేరు ఛానెళ్ల ఫ్రీక్వెన్సీలోకి మారతాయి. ఈ పద్ధతినే డీమాడ్యులేషన్ లేదా విశ్లేషణం అంటారు. ఎంపిక చేసుకున్న ఛానెల్‌కు సంబంధించిన ఫ్రీక్వెన్సీని టీవీ సర్క్యూట్ ఉత్పత్తి చేయగా, అదే ఫ్రీక్వెన్సీకి చెందిన అంశాల అనునాదం (resonance) జరుగుతుంది. ఫలితంగా ఆ ఛానెల్‌కి సంబంధించిన కార్యక్రమాలే తెరపై కనిపిస్తాయి. ఈ ప్రక్రియంతా కాంతి వేగంతో జరుగుతుంది.
No comments:
Post a Comment